‘నేను ఆ స్థాయి నటిని కాదు..’ పద్మశ్రీ అవార్డును తిరస్కరించిన మహానటి సావిత్రి!
on Dec 26, 2024
(డిసెంబర్ 26 సావిత్రి వర్థంతి సందర్భంగా..)
పాత తరం నటీనటుల జీవితాల్లో ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. వాటి గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా కొత్తగానే అనిపిస్తాయి. ముఖ్యంగా మహానటి సావిత్రి వంటి వారి జీవితాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. వారి జీవితం కూడా సినిమాని తలపిస్తుంది. ఆ సినిమాలో ఆనందం ఉంటుంది, విషాదం ఉంటుంది, ఎన్నో మలుపులు కూడా మనకు కనిపిస్తాయి. ఒక సామాన్య యువతిగా జీవితాన్ని ప్రారంభించిన సావిత్రి.. ఎంతో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే సినీ పరిశ్రమకు వచ్చినపుడు ఆమె ఎంతో భయపడేవారు. ఆ భయంతోనే సంసారం చిత్రంలో మొదటి అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సావిత్రి తీరు చూసిన దర్శకనిర్మాతలు ఆ సినిమా నుంచి ఆమెను తప్పించి లక్ష్మీరాజ్యంకి అవకాశం ఇచ్చారు. సావిత్రి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత భయపడిన సందర్భం అదే. ఆ భయమే ధైర్యంగా అడుకు ముందుకు వేసేందుకు ఉపయోగపడింది.
నటిగా మంచి పేరు తెచ్చుకొని స్టార్ డమ్ వచ్చినా ఏనాడూ ఆ హోదాని ప్రదర్శించలేదు సావిత్రి. కెరీర్ మొత్తం ఒక సాధారణ నటిగానే కొనసాగారు. ఒక స్టార్ హీరోయిన్‌కి కల్పించే వసతుల పట్ల ఆమె విముఖత చూపించేవారు. తనకంటూ పర్సనల్ స్టాఫ్ ఎవరూ ఉండేవారు కాదు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే తనకు తోడుగా ఒక అమ్మాయిని తెచ్చుకునేవారు. బస చేసేందుకు హోటల్స్‌కి వెళ్లేవారు కాదు. సారధీ స్టూడియోలోనే ఉండేవారు. ఇక కాస్ట్యూమ్స్ విషయంలో కూడా ఇబ్బంది పెట్టేవారు కాదు. సినిమాలోని క్యారెక్టర్ కోసం దర్శక నిర్మాతలు ఏ దుస్తులు ఎంపిక చేసారో వాటినే ధరించేవారు. నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరోయిన్లలో సావిత్రిని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, ఎఎన్నార్‌లతో కలిసి నటించాల్సి వస్తే ఎంతో జాగ్రత్తగా నడుచుకునేవారు. ఇద్దరిలో ఎవరి సినిమా చేసినా వారికంటే ముందుగానే సెట్‌కి వచ్చి సిద్ధంగా ఉండేవారు.
తను నటిస్తున్న సినిమా యూనిట్‌లోని సభ్యుల్ని ఆమె ఎంత బాగా చూసుకుంటారో తెలిసిందే. ఇంటి నుంచి ప్రత్యేకంగా వంటలు చేయించి షూటింగ్ స్పాట్‌కి తెప్పించేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు. షూటింగ్ విరామ సమయంలో ఆమెకు ఇష్టమైన త్యాగలు, జామకాయలు, వేరుశనక్కాయలు తెప్పించి జూనియర్ ఆర్టిస్టులకు పంచి, వారితోపాటే కూర్చొని తినేవారు. హీరోయిన్గా స్టార్ స్టేటస్ వచ్చినా తను గతంలో ఒక సాధారణ యువతిగా వున్న విషయాన్ని మర్చిపోయేవారు కాదు. యూనిట్‌లోని ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా చూసేవారు. ఎప్పుడూ గలగల మాట్లాడుతూ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేసేవారు. ఆమె సహ నటీనటులు కూడా సావిత్రిని అంతే గౌరవంగా చూసేవారు. పాతతరం నటీనటుల్లో ఎస్.వి.రంగారావు, సావిత్రిలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవార్డులు రాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1969లో సావిత్రిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయబోతున్నట్టు ముందుగానే ఆమెకు తెలియజేశారు. కానీ, తను నటిగా అంతటి స్థాయికి ఎదగలేదనీ, ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.
నటనను జీవితంగా మార్చుకున్న సావిత్రి నిజజీవితంలో ఎప్పుడూ నటించలేదు. అంతేకాదు, తనతో నటిస్తూ మాట్లాడేవారిని గుర్తించలేకపోయేవారు. ఆ కారణంగానే సావిత్రి తన జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వచ్చింది. ఆమెతో సరితూగగల ఏకైక నటి బాలీవుడ్ హీరోయిన్ మీనాకుమారి. ఆమెను అక్కా అని పిలిచేవారు సావిత్రి. దురదృష్టవశాత్తూ ఇద్దరి జీవితాలూ విషాదాంతాలుగానే మారాయి. అప్పటికే పెళ్లయిన జెమినీ గణేశన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత తను మోసపోయానని సన్నిహితులకు చెప్పుకొని బాధపడేవారు. నటిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సావిత్రి తన వ్యక్తిగత జీవితంలో మాత్రం విషాదాన్నే చూశారు.
ఇక సావిత్రి చేసిన దాన ధర్మాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎక్కువగా ప్రచారంలోకి రాని విషయం ఏమిటంటే.. సావిత్రి తల్లి సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మ సొంత ఊరు గుంటూరు జిల్లాలోని వడ్డివారి పాలెం. సావిత్రికి ఆ ఊరంటే ఎంతో మమకారం. దీంతో పెద్దమ్మ సలహాతో ఆ ఊరిలోనే స్థలాన్ని కొని ఒక స్కూల్ కట్టించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ స్కూల్‌ను గుర్తించి గ్రాంట్ అందిస్తూ వచ్చింది. ఒకసారి ప్రభుత్వం గ్రాంట్‌ను పంపించడం ఆలస్యం చేసింది. దీంతో ఆరు నెలల పాటు అక్కడి సిబ్బందికి జీతాలు లేవు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి.. అప్పటికప్పుడు 1 లక్ష 4 వేల రూపాయలు పంపించి స్కూల్‌కి అండగా నిలిచారు. 1962లో ప్రారంభమైన ‘శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇప్పటికీ అదే పేరుతో నడుస్తోంది. అక్కడ సావిత్రి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ‘మహానటి’ చిత్ర దర్శకనిర్మాతలు ఈ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందించారు.
Also Read